అక్షర న్యూస్ :ఎన్నికల సమయంలో తమ అవసరాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆశల పల్లకిలో విహరింపజేసి, ఎన్నికల అనంతరం వారిని విస్మరించడం సరికాదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఊడెం రఘువర్ధన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మ గ్రహ దీక్షలో భాగంగా ఈరోజు కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం జాయింట్ కలెక్టర్ శ్రీ అబ్దుల్ హమీద్ గారికి, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీ అబ్దుల్ రెహమాన్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మురళితో పాటు అధ్యక్షులు ఊడెం రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చాలని, మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పిఆర్సి ని వెంటనే అమలు చేసి, పెండింగ్లో ఉన్న బిల్లులు అన్నింటిని ఏకకాలంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత నెల రోజులుగా తపస్ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి నుంచి ఈరోజు జిల్లా స్థాయి వరకు అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని, మొద్దు నిద్ర నటిస్తుందని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లు అన్నిటిని నెరవేర్చాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను విస్మరించిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని, ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరిగి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం బకాయిపడ్డ నాలుగు కరువు బత్యాలను వెంటనే విడుదల చేయాలని, ఈ కుబేర్ లో ఉన్న పెండింగ్ బిల్లులు అన్నిటిని వెంటనే చెల్లించాలని కోరారు. నెల రోజుల్లోనే పిఆర్సి అమలు పరస్తామని చెప్పిన ప్రభుత్వం, సంవత్సరకాలం అయినా ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు.
ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహించాలని అనుకుంటుందని, ఉద్యోగ ఉపాధ్యాయుల కోరికలు నెరవేర్చకుండా వారు ఏ విధంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని ప్రశ్నించారు. రాష్ట్ర కార్యదర్శి పబ్బతి శ్రీనాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కులగణనలో ఎస్జీటీల కు మాత్రమే విధులను అప్పగించి ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల బాగోగులను గాలికి వదిలేసిందని అన్నారు.
ప్రభుత్వం ఎస్ జి టి ల పట్ల అనుసరిస్తున్న వివక్ష మానుకొని, కుల గణన విధులను అందరూ ఉపాధ్యాయులకు కేటాయించి తొందరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలలు మూసి వేయకుండా, విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగ నర్సిరెడ్డి, మహేందర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.