• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : డెడికేటెడ్‌ కమిషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌..

Bypentam swamy

Nov 4, 2024

అక్షర న్యూస్ :స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలను జారీచేశారు. హైకోర్టు అక్షింతలతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై చర్చించిన సర్కారు ఎట్టకేలకు కండ్లు తెరిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతంపై నిర్ణయానికి రాజ్యాంగంలోని 340వ అధికరణ మేరకు స్వయంప్రతిపత్తి కలిగిన డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిషనే గ్రామస్థాయి వరకు ఆయా వర్గాల రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసి, రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు ప్రకారమే దేశంలోని అన్ని రాష్ర్టాలు బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించాలని చాలా స్పష్టంగా నొక్కిచెప్పింది. ఆ తీర్పును ఉల్లంఘించిన వివిధ రాష్ర్టాలకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతోపాటు, ఆయా రాష్ర్టాల నిర్ణయాలను కొట్టివేసింది.అయినా అవేవీ పరిగణనలోకి తీసుకోకుండా సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకుసాగింది. డెడికేటెడ్‌ కమిషన్‌ బాధ్యతలను కూడా రాష్ట్ర బీసీ కమిషన్‌కే అప్పగిస్తూ జీవో 47ను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ వివిధ బీసీ సంఘాలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వ ఆదేశాలతో మొత్తంగా స్థానిక సంస్థల్లోనే బీసీలకు రిజర్వేషన్లు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తంచేశాయి. వెంటనే రాజ్యాంగ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు జస్టిస్‌ ఎస్‌ నంద ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బీసీ కమిషన్‌కే డెడికేటెడ్‌ కమిషన్‌గా అధికారాలు కల్పించామన్న అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలను తోసిపుచ్చారు. బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని, సుప్రీం మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. ఆ మేరకు తెలంగాణలో కూడా ప్రత్యేక డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించాలని, రెండు వారాల్లో నివేదికను న్యాయస్థానానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో నొక్కిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు కండ్లు తెరిచి డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..