అక్షర న్యూస్ :బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం చెరువుల మరమ్మతు పేరుతో మున్సిపల్ సిద్దిపేట చైర్ పర్సన్ లక్షల రూపాయలు దోచుకు తింటున్నారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తూఇమామ్ ఆరోపించారు. సిద్ధిపేటలోని 14వ వార్డు మచ్చవాని కుంట లో పతంగి ఎగరేస్తూ 14 సంవత్సరాల బాలుడు మృతి చెందడంతో సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తూఇమామ్ మృతి చెందిన బాలుడు కుటుంబానికి సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తూఇమామ్ మాట్లాడుతూ సిద్దిపేటలోని పలు చెరువులలో గుర్రపు డెక్క నిండిపోయి ఉందని దానిని తొలగించాల్సిన మున్సిపల్ అధికారులు మునిసిపల్ పాలకవర్గం చోద్యం చూస్తున్నారని అన్నారు.
ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ కోసం సిద్దిపేటలోని చెరువులను క్లీన్ చేసేందుకు మున్సిపల్ పాలకవర్గం 30 లక్షల రూపాయలకు పైగా డబ్బులు కేటాయించిందని అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మున్సిపల్ నిధులను కేటాయిస్తూ వస్తున్నదని కానీ పనులు నిర్వహించకుండా డబ్బులను మాత్రం మున్సిపల్ చైర్పర్సన్ మంజుల ఆమె భర్త రాజనర్సు నిధులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు వారు కొన్ని కోట్ల రూపాయలు బతుకమ్మ సెంటిమెంట్ పేరిట దోచుకున్నారని అన్నారు.
చెరువులను క్లీన్ చేయకపోవడంతోనే అభం శుభం తెలియని ఓ బాలుడు పతంగి ఎగరేస్తూ చేరులో మునిగి చనిపోయాడని అన్నారు. బాలుడు చావుకు కారణం మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తో పాటు ఆమె భర్త రాజనర్సు కారణమని అన్నారు.
వెంటనే పోలీసులు సుమోటో కింద వారిద్దరిపై ఇంకెవరైనా బాధ్యులైతే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అన్నారు. బాలుడు మృతికి కారణమైన మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు బాలుడు కుటుంబానికి 70 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ నష్టపరిహారం అందించకుంటే బాలుడి మృతదేహంతో మున్సిపల్ కార్యాలయంతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్స్ ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు బతుకమ్మ పండుగకు సంభందించి మున్సిపల్ నుండి చెరువుల మరమ్మత్తు కోసం ఎన్ని నిధులు కేటాయించారు ప్రజలకి తెలిసేలా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ కోట్ల రూపాయలు వెనక వేసుకున్న మున్సిపల్ చైర్మన్ రాజనర్సు చిట్టా బయటికి తీస్తామని అన్నారు. సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు నిర్లక్ష్యం వల్ల చనిపోయిన విషయాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ దామోదర రాజనర్సింహ పార్టీ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. చనిపోయిన బాలుడు కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యదారి మధు, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయ్యాజుద్దీన్ ,అనిల్, ఫయాజ్ కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.

