అక్షర న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టినట్లయితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు.
శుక్రవారం సిద్దిపేట జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయ సముదాయం (IDOC) సమావేశ మందిరంలో, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ల్యాండ్ & అట్రాసిటీ కేసులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అణచివేతకు గురైన ఎస్సీ,ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా పనిచేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. సమస్య పరిష్కారం కోరుతూ వచ్చే బాధితుల పట్ల సానుకూలంగా స్పందించి, వారి వాదనను శ్రద్ధగా వినడమే సమస్యకు సగం పరిష్కారమని పేర్కొన్నారు.
ప్రభుత్వం మంజూరు చేసే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు లబ్ధిదారులకు పూర్తిగా చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎక్కడైనా నిధులు దుర్వినియోగమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో 2022 నుంచి 2025 వరకు 355 అట్రాసిటీ కేసులు నమోదవగా, వాటిలో 328 కేసుల్లో బాధితులకు పరిహారం అందించామని, వివిధ కారణాల వల్ల 27 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
గురుకుల పాఠశాలల మరమ్మతులకు సంబంధించిన నివేదికను కమిషన్‌కు సమర్పించాలని, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల విద్యార్థులకు అందించాల్సిన బ్యాగులు, పుస్తకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చొరవతో 25 శాతం బడ్జెట్ విడుదల జరిగిందని, మిగతా బడ్జెట్ ను మార్చి చివర్లోగా అందిస్తామని తెలిపారు అన్నారు. జిల్లా అధికారులు స్కూళ్లను పరిశీలించి విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా తర్వాత అత్యధికంగా (సుమారు 17) గురుకులాలు ఉన్న జిల్లా సిద్దిపేట అని పేర్కొంటూ, ఈ స్కూళ్లలో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల మంజూరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. జనవరి చివరి వరకు 6 నెలల పెండింగ్ వేతనాలు త్వరలోనే చెల్లిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం హైజనిక్ భోజనం అందించాలని, వివిధ సబ్సిడీ పథకాల అమలులో లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
గ్రామాలలో గోడౌన్‌లు, మహిళా సంఘాల భవనాలు, పంచాయితీ భవనాల నిర్మాణానికి సంబంధించి, సంబంధిత అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా పనులు చేపట్టాలని సూచించారు. అలాగే అక్బర్‌పేట–భూంపల్లి ప్రాంతంలో పాత విద్యుత్ లైన్ మార్చి, నూతన విద్యుత్ లైన్ మరమ్మతులకు సంబంధించిన ఎస్టిమేట్స్ ను ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని, నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభించాలని తెలిపారు. అలాగే భూంపల్లి పరిధిలో కూలిపోయే ప్రమాదంలో ఉన్న రెండు వాటర్ ట్యాంకుల స్థానంలో కొత్త ట్యాంకుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయితీలలో పనిచేస్తున్న కర్మచారి, పారిశ్రామిక కార్మికులకు ఇన్స్యూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని, గడువు ముగిసేలోపు వాటిని రెన్యువల్ చేయించాలని సూచించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.
జనవరి నెలాఖరులోగా ఎస్సీ, ఎస్టీ కేసులు పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎటువంటి పైరవీకి తావు లేకుండా ఎల్–1, ఎల్–2, ఎల్–3 విభాగాలుగా లబ్ధిదారులను విభజించి పారదర్శకంగా ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వివరించారు.
జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, జిల్లాలో నమోదయ్యే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం దిశగా జిల్లా యంత్రంగా కృషి చేస్తుందని, అందులో భాగంగా షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలకు సంబంధించి 2023 నుండి 2025 వరకు 28 కేసులు కమిషన్ సూచించగా వాటి దశల వారీగా పరిష్కరించడం జరుగుతుంది తెలిపారు.
సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, ఎస్సీ–ఎస్టీ కమిషన్‌కు సంబంధించిన అంశాల్లో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్లు రాంబాబు నాయక్, జిల్లా శంకర్, కొంకటి లక్ష్మీనారాయణ, అడిషనల్ డిసిపి, ఆర్డీఓలు, ఏసీపీలు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయనైనది.
