• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : రిటైర్డ్ ఉద్యోగుల ఆక్రందన – రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై శాసనమండలి విప్ దేశపతి శ్రీనివాస్ మండిపాటు.

Bypentam swamy

Jan 4, 2026

అక్షర న్యూస్ : తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్ర నిర్మాణంలోనూ వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగులను, పదవీ విరమణ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పాతాళానికి నెట్టేస్తోందని శాసనమండలి విప్ మరియు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
“ఒక ఉద్యోగి తన 35-40 ఏళ్ల జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసి, రిటైర్మెంట్ రోజున ప్రశాంతంగా ఇంటికి వెళ్లాల్సింది పోయి.. అప్పుల వాళ్లకు భయపడి అర్ధరాత్రి ఇల్లు వదిలి పారిపోయే దుస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది. ఇది ప్రజా పాలన కాదు, పేదల కన్నీళ్లు తుడవలేని కర్కోటక పాలన” అని ఆయన విమర్శించారు.
• పెన్షనరీ బకాయిలు అందక, ఆర్థిక ఇబ్బందులు మరియు మానసిక వేదనతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 36 మంది పెన్షనర్లు మరణించడం అత్యంత దారుణం. ఇవి సహజ మరణాలు కావు, ప్రభుత్వమే చేస్తున్న ‘చట్టబద్ధమైన హత్యలు’.
• ముఖ్యమంత్రి ఊరిలోనే విషాదం: స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గ్రామానికి చెందిన కుడుముల కొండయ్య అనే పెన్షనర్, వైద్యం అందక, తన బకాయిలు ఇస్తే బతుకుతానని మీడియా సాక్షిగా వేడుకున్నా.. ప్రభుత్వం కనికరించకపోవడంతో ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ఘటన రేవంత్ సర్కార్ కు మాయని మచ్చ.
• పోలీసు అధికారిగా పనిచేసిన బాలకిషన్ వంటి వారు తన బిడ్డ పెళ్లికి రావలసిన డబ్బులు అందక, కూతురు ఆత్మహత్యకు గురైతే, ఆ బాధతో హార్ట్ స్ట్రోక్ తో మరణించడం గుండెలను పిండేస్తోంది. అప్పుల బాధ భరించలేక నల్గొండలో సత్యనారాయణ వంటి ఉద్యోగులు ఇళ్లు వదిలి పారిపోతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది.
• GPF, TSGLI, GIS వంటివి ప్రభుత్వం ఇచ్చే దానాలు కావు, ఉద్యోగి తన జీతం నుండి దాచుకున్న సొంత సొమ్ము. ఆ సొమ్మును కూడా ప్రభుత్వం ‘ఈ-కుబేర్’ లో బందీ చేయడం దారుణం. 14 వేల మంది పెన్షనర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది
• ⁠డిమాండ్లు:
1. కుహనా మేధావుల తప్పుడు లెక్కలను పక్కన పెట్టి, రిటైర్ అయిన 14 వేల మంది ఉద్యోగుల బకాయిలను (GPF, GIS, Leave Encashment, Gratuity) తక్షణమే ఏకమొత్తంగా చెల్లించాలి.
2.పెన్షనర్లు తమ పెన్షన్ నుండి తిరిగి చెల్లించే ‘కమ్యూటేషన్’ మొత్తాన్ని వెంటనే మంజూరు చేయాలి.
ఎన్నికల హామీ మేరకు నగదు రహిత వైద్యం కోసం హెల్త్ కార్డులు జారీ చేసి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందేలా చూడాలి.
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా: పెన్షన్ బకాయిలు అందక చనిపోయిన 36 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పి, భారీ పరిహారం ప్రకటించాలి.
5. సీపీఎస్ రద్దు – పీఆర్సీ అమలు: పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేసి, కొత్త పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి. ఇచ్చిన హామీ ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి
“ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అంటే కేవలం ఓటు బ్యాంకు కాదు, వారు ఈ రాష్ట్ర నిర్మితలు. వారి ఉసురు తగిలితే ఏ సామ్రాజ్యమైనా కూలిపోక తప్పదు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, పెన్షనర్ల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది” అని దేశపతి శ్రీనివాస్ హెచ్చరించారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..