అక్షర న్యూస్ : ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ కు సంస్కృత ఉపన్యాసక సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మృత్యుంజయ శర్మ తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఒక రూపాయి మేయర్ గా ప్రసిద్ధి చెందిన కరీంనగర్ మాజీ మేయర్ విద్యావంతుడు సర్దార్ రవీందర్ సింగ్ సంస్కృత భాషకు ఇంటర్లో ఉపద్రవం వచ్చిన సందర్భంలో కరీంనగర్ లో సంస్కృత శంఖారావం ఏర్పాటు చేసిన విషయం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించారన్నారు. రవీందర్ సింగ్ నిరుద్యోగుల పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేయగల సమర్థత కలిగిన వ్యక్తి అన్నారు. రాబోయే రోజుల్లో శాసనమండలి సభ్యులుగా గెలిపిస్తే నిరుద్యోగుల గొంతుకై ప్రభుత్వాన్ని ప్రశ్నించగల సత్తా రవీందర్ సింగ్ కు ఉందన్నారు. అందు కొరకే సంస్కృత ఉపన్యాసక సంఘం నాలుగు వేల ఉపన్యాసకులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సంపత్, గౌరవ సలహాదారులు సురేష్, తిరుపతి, గణేష్, సుశీల్, రాజేష్, నాగరాజు, సిరిసిల్ల కౌన్సిలర్ భాస్కర్, నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.


