అక్షర న్యూస్ :విద్య రంగాన్ని విస్మరించేలా కేంద్ర బడ్జెట్..!
2025-2026 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులు గుండుసున్నా అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ.డీ.ఎస్.యూ)తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్ మండిపడ్డారు. ఈ కేటాయింపు తెలంగాణ రాష్ట్రం పై భాజపా పార్టీకి ఉన్న వివక్షతకు నిదర్శనం అన్నారు.
నిన్న ప్రవేశపెట్టిన 50 లక్షల 65 వేల 345 కోట్ల బడ్జెట్ లో విద్యారంగానికి 2.53% (1,28,650 కోట్లు) మాత్రమే కేటాయించి తీవ్ర నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. ఇందులో పాఠశాల విద్యకు 78,572 కోట్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం అభివృద్ధి ఆవిష్కరణల కోసం 20,000 కోట్లు మరియు ఉన్నత విద్యకు 50077 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని అన్నారు.
ఈ బడ్జెట్ కేటాయింపులను పీ.డీ.ఎస్.యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. భాజపా ప్రభుత్వం ప్రతి జిల్లాలో కొత్తగా ఐఐటి ,ఐఐఎం, నవోదయ, సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి మరిచిందని తెలిపారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వికాసిత్ భారత్ మరియు పేదరికం నిర్మూలనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రకటించి బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు. వరుసగా రెండుసార్లు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయించింది గుండు సున్నానేననీ,రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు,ఎనిమిది మంది ఎంపీ లు ఒక్క ఎమ్మెల్సీ , ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా రాష్ట్రానికి రూపాయి తేలేదని తెలంగాణ సమాజం దీన్ని అర్థం చేసుకోవాలన్నారు.
విద్య రంగానికి అరకొరా నిధులను కేటాయించడాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్టు స్పష్టం చేశారు.


