అక్షర న్యూస్ : ట్రాన్స్‌జెండర్లపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని సిద్దిపేట ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సునీత, అంకిత తెలిపారు. హైదరాబాద్ చింతల్‌లో జరిగిన డబ్బుల వసూలు ఘటనతో సిద్దిపేటకు చెందిన ట్రాన్స్‌జెండర్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. తాము సిద్దిపేటలో ఎంతో గౌరవంగా జీవిస్తున్నామని తెలిపారు. తమ జీవనోపాధి కోసం భిక్షాటన చేస్తున్నామని, ఇప్పటివరకు ఎవరినీ డబ్బులు డిమాండ్ చేసిన దాఖలాలు లేవన్నారు. శుభకార్యాలు జరిగిన సందర్భాల్లో తమకు ప్రజలు సంతోషంగా అందించే డబ్బులను మాత్రమే స్వీకరిస్తున్నామని చెప్పారు.శుభకార్యాలకు ట్రాన్స్‌జెండర్లు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, డబ్బుల కోసం బలవంతంగా డిమాండ్ చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. సిద్దిపేట ప్రజలు తమను ఇప్పటివరకు ఆదరిస్తున్నారని, వారు సంతోషంతో ఇచ్చే డబ్బులను మాత్రమే తీసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే పద్ధతిని కొనసాగిస్తామని వెల్లడించారు.ఈ సమావేశంలో ట్రాన్స్‌జెండర్లు మేఘన, సంజన, రజిని, అనూష, షాలిని, మల్లికా, రేణు, కరిష్మా, శ్రావణి, అంజలి, తదితరులు పాల్గొన్నారు.


