అక్షర న్యూస్:మండలంలోని వీరన్నపేట గ్రామంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ నిర్వాహకులు మొగుళ్ళ సుధాకర్ రెడ్డి-నంధిత ఆధ్వర్యంలో సోమవారం విశేష పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా కొనసాగాయి. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు.
సంపత్ కుమార్,ధనుంజయ్ ఆలయంలోని కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కల్యాణమండపంలో 9 కలశాల్లోని జలాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరిపారు. పాలు, పెరుగు వివిధ శుద్ధ జలాలతో వేదమంత్రాలు, మంగళవాయిద్యాలతో సుమారు రెెండు గంటలు అష్టోత్తర శత ఘటాభిషేక పూజలు నిర్వహించారు.
పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవ మూర్తులను, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్ర నామార్చనలు జరిపారు. స్వామి అమ్మవార్లను రథసేవలో తీరిదిద్ది ఆలయ ప్రాంగణంలో ఊరేగించనున్నారు.
భక్తులు వేకువ జామునే ఆలయంలో చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పవనసుత భజన మండలి చేర్యాల సభ్యులు భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన అయ్యప్ప స్వామి ఆలయ అధ్యక్షులు తాటిపల్లి ఆంజనేయులు గుప్త ఆలయ విశిష్టత గురించి వివరించారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నప్రసాదం తో పాటు తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.

