అక్షర న్యూస్ :
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)తో పాటు సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా కేజీబీవీలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నం, గుడ్డు, క్వాలీఫ్లవర్ కూర, పప్పు, రసం, పెరుగుల పరిశీలించారు. విద్యార్థులకు డైనింగ్ హాల్‌లో మాత్రమే భోజనం వడ్డించాలని, ఇతర ప్రాంతాల్లో భోజనం వడ్డించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ, భోజనం చేసే సమయంలో క్రమశిక్షణతో కూడిన మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు మరల అన్నం లేదా కూరలు కోరినప్పుడు, వారు కూర్చున్న చోటికే వెళ్లి వడ్డించాలని వంట సిబ్బందికి ఆదేశించారు. కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటిస్తూ, నాణ్యమైన మరియు రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులు కడుపునిండా తినేలా వండించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వంటగది మరియు పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఈగలు, దోమలు రాకుండా డెటాల్ వంటి శానిటైజర్లతో క్రమం తప్పకుండా శుభ్రపరచాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని తెలిపారు.
అనంతరం కేజీబీవీ సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ సందర్శించి, అక్కడ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కూరల నాణ్యతను మరింత మెరుగుపరచాలని, నిర్లక్ష్యంగా వంట చేసి విద్యార్థులకు ఆహారం అందిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నాణ్యమైన సరుకులతో రుచికరమైన ఆహారాన్ని వండి విద్యార్థులకు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. డైనింగ్ హాల్‌తో పాటు పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

